అక్క మరణవార్తను దాచి టోక్యో పంపిన కుటుంబ సభ్యులు.. తిరిగొచ్చాక తెలిసి విమానాశ్రయంలోనే సోదరి కన్నీరు

09-08-2021 Mon 08:58
  • ఒలింపిక్స్ 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే‌లో పాల్గొన్న ధనలక్ష్మి
  • జులై 12న ధనలక్ష్మి సోదరి కన్నుమూత
  • ఏకాగ్రత దెబ్బతింటుందని విషయం దాచిన కుటుంబ సభ్యులు
Indian Olympian breaks down upon learning about sisters death
టోక్యో ఒలింపిక్స్ ముగించుకుని తిరిగి స్వదేశానికి వచ్చిన ఓ అథ్లెట్ తన అక్క మరణించిన విషయం తెలిసి విమానాశ్రయంలోనే కన్నీరుమున్నీరుగా విలపించింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా గుండూర్‌కు చెందిన ధనలక్ష్మీశేఖర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టుకు ఎంపికైంది. దీంతో టోక్యో వెళ్లే మిగతా టీం సభ్యులను కలుసుకోవడానికి పంజాబ్‌ వెళ్లింది.

అదే సమయంలో అంటే జులై 12న ఆమె అక్క మరణించింది. అయితే, ఈ విషయం ధనలక్ష్మికి తెలిస్తే ఆమె ఏకాగ్రత దెబ్బ తింటుందని భావించిన కుటుంబ సభ్యులు విషయాన్ని దాచిపెట్టారు. ధనలక్ష్మి శనివారం రాత్రి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగా సోదరి మృతి విషయం తెలిసింది. దీంతో విమానాశ్రయంలోనే ఆమె కూలబడి విలపించింది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.