Tokyo Olympics: ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు... అమెరికాకు అగ్రస్థానం

  • జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్
  • ఆగస్టు 8తో ముగింపు
  • అందరినీ అలరించిన క్రీడోత్సవం
  • భారత్ కు 48వ స్థానం
Tokyo Olympics concludes with a grand note

పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కిందట ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో మునుపటి మాదిరి కాకుండా ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో భారత బృందం ఫ్లాగ్ బేరర్ గా రెజ్లర్ భజరంగ్ పునియా వ్యవహరించాడు. పునియా 65 కిలోలల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించాడు.

గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ జపాన్ ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో క్రీడలు నిర్వహించింది. కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి అందరి ప్రశసంలకు పాత్రురాలైంది. ఇక, తదుపరి ఒలింపిక్ క్రీడలు 2024లో పారిస్ లో జరుగుతాయి.

కాగా, టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా నెంబర్ వన్ గా నిలిచింది. ఆఖరి వరకు అమెరికా, చైనా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే చివర్లో అనేక క్రీడాంశాల్లో అమెరికా పసిడి పతకాలు నెగ్గి చైనాను వెనక్కి నెట్టింది.

అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించింది. చైనా 38 పసిడి పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు చేజిక్కించుకుని రెండోస్థానంలో నిలిచింది. ఇక, ఆతిథ్య జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు (20 స్వర్ణాలు) టాప్-5లో నిలిచాయి.

భారత్ కు పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.

More Telugu News