Bio Bubble: ఐపీఎల్ పార్ట్-2 బయో బబుల్ నిబంధనలు విడుదల

BCCI releases new bio bubble document for IPL part two
  • కరోనా వల్ల భారత్ లో ఆగిపోయిన ఐపీఎల్
  • యూఏఈలో పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయం
  • సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ పార్ట్-2
  • లంక పర్యటనలో కరోనా కలకలం
  • కొత్త బయో బబుల్ కు రూపకల్పన
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ను యూఏఈ గడ్డపై పూర్తిచేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ లో మిగిలిపోయిన మ్యాచ్ లు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ బయో బబుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇటీవల శ్రీలంక పర్యటనలో పలువురు భారత క్రికెటర్లు కరోనా బారినపడిన నేపథ్యంలో, ఐపీఎల్ కోసం మరింత భద్రమైన బయో బబుల్ నియమావళికి రూపకల్పన చేసింది.

నూతన నిబంధనలు ఉల్లంఘించే ఫ్రాంచైజీ క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజా బయో బబుల్ ప్రకారం... విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు వచ్చే 72 గంటల ముందు కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి.

ఆర్టీ పీసీఆర్ టెస్టు వచ్చేవరకు క్రికెటర్లు, సహాయ సిబ్బంది స్వీయనిర్బంధంలో ఉండాలి. ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చిన వారు తమ ఫ్రాంచైజీకి కేటాయించిన నగరానికి చేరుకోవచ్చు. నెగెటివ్ వచ్చిన వారికి ఎలాంటి క్వారంటైన్ అమలు చేయరు. విదేశీ క్రికెటర్లు దుబాయ్ ఎయిర్ పోర్టులో తమ ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

ఒక్కసారి బయో బబుల్ లో ప్రవేశించాక, ఏదైనా అనివార్య కారణాలతో తప్ప మరే ఇతర కారణాలకు బయటికి పంపించడం కుదరదు. బబుల్ నుంచి బయటికి వచ్చేవారు బీసీసీఐ వైద్యాధికారి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి బయో బబుల్ లో ప్రవేశించాలంటే 6 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. పైగా వారికి 2వ, 4వ, 6వ రోజు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తేనే బబుల్ లోకి ప్రవేశం కల్పిస్తారు.
Bio Bubble
IPL Part-2
BCCI
UAE
India

More Telugu News