Andhra Pradesh: మంత్రివర్గం తప్పు చేస్తే.. ఉద్యోగులను శిక్షిస్తారా?: యనమల మండిపాటు

  • అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సచివాలయ ఉద్యోగులపై చర్యలు
  • అసెంబ్లీకి, కాగ్‌కు, కేంద్రానికి తెలియకుండా ఖర్చులు దాచారు
  • మంత్రి బుగ్గన వ్యాఖ్యలు పచ్చి అబద్ధం
Yanamal Ramakrishnudu fires on AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాచారాన్ని లీక్ చేశారంటూ సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నేతల అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి వర్గం చేసిన తప్పులకు ఉద్యోగులను బాధ్యులను చేయడం ఎక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రి వర్గం ట్రస్టీ మాత్రమే అన్న సంగతిని గుర్తెరగాలన్నారు.

అసెంబ్లీకి, కాగ్‌కు, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఖర్చులను ఎందుకు దాచారని నిలదీశారు. తమ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే, జగన్ ప్రభుత్వం 11 లక్షల మందికే ఇస్తోందని, చంద్రన్న బీమాను తాము 2.47 కోట్ల మందికి ఇస్తే, ఈ ప్రభుత్వం 67 లక్షల మందికే వైఎస్సార్ బీమాను కుదించిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నేటి ఆర్థిక సంక్షోభానికి టీడీపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేయడమే కారణమన్న ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్నది పచ్చి అబద్ధమని యనమల అన్నారు.

More Telugu News