ఇందిరాగాంధీ పాత్రలో ఒదిగిపోయిన లారాదత్తా!

05-08-2021 Thu 21:51
  • అక్షయ్ కుమార్ హీరోగా 'బెల్ బాటమ్' 
  • 'రా' ఏజెంట్ గా నటిస్తున్న అక్షయ్  
  • కథలో కీలకంగా ఇందిరాగాంధీ పాత్ర 
  • ప్రోస్థెటిక్ మేకప్ వాడిన నిపుణులు
  • లారాదత్తాపై ప్రశంసల వర్షం  
Lara Datta as Indira Gandhi

ఆర్టిస్టులకు కొన్ని రకాల పాత్రలు సవాలుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా ఎంతో ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల పాత్రలు పోషించడం అంటే మరీనూ. ఆహార్యం నుంచి.. హావభావాల వరకు ఆయా వ్యక్తులను స్ఫురింపజేయాలి. అప్పుడే ఆయా పాత్రలు తెరపై పండుతాయి. ఇప్పుడు ప్రముఖ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారాదత్తా పోషిస్తున్న పాత్ర కూడా అలాంటిదే. దేశ రాజకీయ యవనికపై ప్రధానిగా తనదైన విశిష్ట ముద్ర వేసిన ఇందిరాగాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తోంది.

అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ప్రస్తుతం 'బెల్ బాటమ్' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అక్షయ్ 'రా' ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర కూడా కీలకమైనది. అందుకోసం లారాదత్తాను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రలో లారాను చూస్తున్న వాళ్లంతా 'అరే .. అచ్చం ఇందిరలానే వుందే' అంటూ లారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఇందులో లారాను ఇందిరలా చూపించడం కోసం మేకప్ పరంగా పెద్ద కసరత్తే చేశారట.   ప్రోస్థెటిక్ మేకప్ చేసి ఆమెను ఇందిరలా తీర్చిదిద్దారు. ఇందుకోసం మేకప్ నిపుణులతో పాటు లారా కూడా చాలా కష్టపడింది. ఇందిర బ్రాండ్ హెయిర్ స్టయిల్ ..చీరకట్టు.. హావభావాలు.. వేగంతో కూడిన నడకతో లారా ఇందిరను యాజిటీజ్ గా దించేశారని ప్రశంసలు వస్తున్నాయి.