ఒలింపిక్స్ రజతం సాధించిన రవికుమార్ కు రూ.4 కోట్ల నజరానా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం

05-08-2021 Thu 18:27
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
  • 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతం
  • పోరాడి ఓడిన రవి కుమార్ దహియా
  • క్లాస్-1 ఉద్యోగం కూడా ఇస్తామన్న హర్యానా సర్కారు
Haryana govt announces Ravi Kumar Dahiya huge cash reward

టోక్యో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ క్రీడాంశంలో రజతం సాధించిన రవికుమార్ దహియాపై హర్యానా సర్కారు కాసుల వర్షం కురిపించింది. రవికుమార్ దహియా హర్యానాకు చెందిన అథ్లెట్. టోక్యో ఒలింపిక్స్ లో విశేష ప్రతిభ కనబర్చిన ఈ వస్తాదు 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రజతంతో మెరిశాడు. దాంతో హర్యానా ప్రభుత్వం రవికుమార్ కు రూ.4 కోట్ల నజరానా ప్రకటించింది.

అంతేకాదు, క్లాస్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో స్థలం అందిస్తామని పేర్కొంది. రవి కుమార్ స్వస్థలం నహ్రీలో రెజ్లింగ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సహకరిస్తామని వెల్లడించింది. అటు, రెజ్లర్ రవి కుమార్ దహియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. టోక్యో ఒలింపిక్స్ లో రవి కుమార్ గొప్ప పోరాట పటిమ కనబర్చాడని కితాబిచ్చారు.