హింసించి ఆనందించడం జగన్ కు పరిపాటిగా మారింది: చంద్రబాబు

05-08-2021 Thu 17:25
  • సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం
  • ఉమ కాన్వాయ్ ని అడ్డుకోవడం హేయమని విమర్శలు
  • కవ్విస్తున్నారని వెల్లడి
  • చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారని వ్యాఖ్యలు
Chandrababu fires on CM Jagan

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ పై మరోసారి ధ్వజమెత్తారు. దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకోవడం హేయమని వ్యాఖ్యానించారు. హింసించి ఆనందించడం జగన్ కు పరిపాటిగా మారిందని అన్నారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలు, జాతీయ రహదారిపై పోలీసులు ఏ విధంగా వాహనాలు ఆపుతారని ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకుందని విమర్శించారు.

ఇవాళ దేవినేని ఉమా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు వద్ద ఉమా కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఉమా ప్రయాణిస్తున్న కారును వదిలి, ఆయన అనుచరుల కారులను మాత్రం నిలిపివేశారు. దాంతో ఉమా, పట్టాభి తదితర టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా భీమడోలు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టీడీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.