మంగినపూడి బీచ్ లో విశృంఖలంగా వ్యభిచారం... పోలీసుల దాడులు

05-08-2021 Thu 16:42
  • ఓ రిసార్ట్ లో అసాంఘిక కార్యకలాపాలు
  • గంటల చొప్పున అద్దెతో సొమ్ము చేసుకుంటున్న రిసార్ట్
  • దాడులు చేపట్టిన మచిలీపట్నం రూరల్ పోలీసులు
  • ఎనిమిది జంటలను అదుపులోకి తీసుకున్న వైనం
Police raids at Manginapudi beach

కృష్ణా జిల్లాలో సుప్రసిద్ధ పర్యాటక స్థలంగా మంగినపూడి బీచ్ కు పేరుంది. మచిలీపట్నం సమీపంలోని ఈ బీచ్ కు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో మంగినపూడి బీచ్ లోని ఓ రిసార్ట్ విశృంఖల వ్యభిచారానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గంటల చొప్పున అద్దె వసూలు చేస్తూ, గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడం పట్ల పోలీసులు తీవ్రంగా స్పందించారు.

ఈ క్రమంలో, ఇవాళ పోలీసులు ఆ రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. మచిలీపట్నం రూరల్ పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. పోలీసుల రాకను గమనించిన కొన్ని జంటలు పక్కనే ఉన్న తోటల్లోకి పరుగులు తీశాయి. ఈ దాడుల్లో ఎనిమిది జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ రిసార్ట్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారికి, వ్యభిచారులకు నెలవుగా ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.