మానుకోటలో రాళ్లు విసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా?: సీఎం కేసీఆర్​ పై ఈటల రాజేందర్​ ఫైర్​

05-08-2021 Thu 14:37
  • ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తున్నారు
  • ఉద్యమకారులంతా ఆలోచించుకోవాలి
  • నన్ను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్ల ఖర్చు
  • మరో మూడు రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా
Eatala Rajender Discharged From Hospital

ఉద్యమకారులను వదిలేసి ఉద్యమద్రోహులను కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపైకి రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారన్నారు. దీనిపై తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులంతా ఓ సారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైద్యులు తనకు మెరుగైన చికిత్స చేశారని చెప్పారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే సీఎం హామీల వర్షం గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడాన్ని తానూ స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్రంలో అందరికీ దానిని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధే ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే డబ్బును ఇవ్వాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలనూ ఆదుకోవాలన్నారు.

గతంలో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ నేతలే ప్రయత్నించారని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా తనను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని, నేతలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను నాటకాలు ఆడేవాడిని కాదన్నారు. వైద్యుల సూచన మేరకు మరో రెండు మూడు రోజుల్లో ప్రజాదీవెన పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని స్పష్టం చేశారు.