పెగాసస్​ వివాదంపై చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

05-08-2021 Thu 13:52
  • కథనాలు నిజమే అయితే ఆరోపణలు తీవ్రమే
  • ఆ అంశంపై విచారణ జరగాల్సిందే
  • దానికి పిటిషనర్లు బలమైన ఆధారాలు తీసుకురాలేదు
  • 2019లోనే పెగాసస్ నిఘాపై కథనాలు
  • అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని పిటిషనర్లకు ప్రశ్న
Supreme Court Observes Pegasus Row Is A Serious Issue

దేశంలో సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ నిఘాపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను కోర్టు ఈరోజు విచారించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం పిటిషన్ల విచారణను చేపట్టింది.

పెగాసస్ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయితే.. ఆ ఆరోపణలు చాలా తీవ్రమైనవని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వాటిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. అయితే, ఆ విచారణకు, వాదనలకు కావాల్సిన బలమైన ఆధారాలు, మెటీరియల్ ను మాత్రం పిటిషనర్లు సేకరించలేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంతో విషయ పరిజ్ఞానం ఉండి కూడా ఆ వివరాలను ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు.

ప్రభావవంతమైన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారని 2019లోనే ఆరోపణలు వచ్చాయని జస్టిస్ రమణ గుర్తు చేశారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా కచ్చితమైన సమాచారాన్ని సేకరించారా? లేదా? అనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ తమ ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదనీ ప్రశ్నించారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు కదా? అని పిటిషనర్లకు చురకలంటించారు.

పిటిషనర్ల తరఫున అడ్వొకేట్, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి పెగాసస్ ఎంటరైపోతుందని, ప్రజల గోప్యత, గౌరవానికి భంగం వాటిల్లుతోందని, భారత గణతంత్ర వ్యవస్థ విలువలపై దాడి అని అన్నారు. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, అడ్వొకేట్ ఎంఎల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ , కొందరు జర్నలిస్టులు పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.