Team India: ట్రెంట్ బ్రిడ్జ్ లో నిప్పులు చెరిగిన భారత పేసర్లు... ఇంగ్లండ్ 183 ఆలౌట్

Team India bowlers fires on Trent Bridge pitch
  • భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం
  • తొలిరోజు ఆటలో భారత్ దే పైచేయి
  • రాణించిన భారత బౌలర్లు
  • ఇంగ్లండ్ లో రూట్ టాప్ స్కోరర్
ఇంగ్లండ్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా పేసర్లు అద్భుతంగా రాణించారు. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే, భారత పేస్ చతుష్టయం బుమ్రా (4/46), షమీ (3/28), శార్దూల్ ఠాకూర్ (2/41), సిరాజ్ (1/48) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో తొలి రోజు కూడా పూర్తి కాకముందే ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ చేసిన 64 పరుగులే అత్యధికం. జానీ బెయిర్ స్టో 29, శామ్ కరన్ 27 నాటౌట్, జాక్ క్రాలే 27 పరుగులు చేశారు. ఓపెనర్ రోరీ బర్న్స్, డాన్ లారెన్స్, జోస్ బట్లర్ పరుగులేమీ సాధించకుండానే వెనుదిరిగారు.

కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ను శార్దూల్ ఠాకూర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వైనం తొలి రోజు ఆటలో హైలైట్ గా నిలుస్తుంది. బంతి లెగ్ సైడ్ వెళుతుందని భావించిన రూట్ వికెట్లకు ఎదురుగా నిలిచి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి సర్రున స్వింగ్ అవుతూ రూట్ ప్యాడ్లను తాకడం, ఠాకూర్ అప్పీల్ చేయడం, అవుట్ అంటూ అంపైర్ వేలెత్తడం చకచకా జరిగిపోయాయి.
Team India
England
Trent Bridge
First Test

More Telugu News