ఇంగ్లండ్ తో తొలి టెస్టు... కొత్త బంతితో రాణించిన భారత బౌలర్లు

04-08-2021 Wed 18:56
  • భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ షురూ
  • నాటింగ్ హామ్ లో తొలి టెస్టు ప్రారంభం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 66 పరుగులకే 3 వికెట్లు డౌన్
Indian seam bowlers scalps three early wickets against England

నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు కొత్త బంతితో గణనీయమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పిచ్ స్వింగ్ కు అనుకూలిస్తుండడంతో భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ తీసి ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బకొట్టారు.

ఓపెనర్ రోరీ బర్న్స్ (0) డకౌట్ కాగా, ఈ వికెట్ బుమ్రా ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన జాక్ క్రాలే 4 ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించాడు. అయితే 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డామ్ సిబ్లి (18) కుదురుకుంటున్నట్టే కనిపించినా షమీ బౌలింగ్ లో అవుటవడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ చేజార్చుకుంది.

ప్రస్తుతం ఇంగ్లండ్ 33 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ జో రూట్ 23 పరుగులతోనూ, వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో 6 పరుగులతోనూ ఆడుతున్నారు.