టాకీ పార్టు పూర్తిచేసుకున్న 'ఆచార్య'

04-08-2021 Wed 17:16
  • చిరు, కాజల్ జంటగా కొరటాల 'ఆచార్య'
  • మరోజంటగా చరణ్, పూజ హెగ్డే 
  • రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్
  • విడుదల తేదీపై అందరిలో ఆసక్తి  
Chiranjeevi and Ram Charan Acharya talkie over

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' రూపొందుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. ఇటీవలే మళ్లీ షూటింగుకు వెళ్లారు. చిరంజీవి .. చరణ్ .. సోనూసూద్ తదితరులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మధ్యలో వర్షాల వలన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.

తాజాగా ఈ సినిమా టాకీపార్టును పూర్తిచేశారు. అదే విషయాన్ని ఈ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, చిరంజీవి - చరణ్ కలిసి దిగిన ఒక స్టిల్ ను వదిలారు. అడవిలోని ఒక పెద్దచెట్టు క్రింద బండరాయిపై కూర్చుని ఉన్న చిరూ .. చరణ్ ల ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా రెండు పాటలను చిత్రీకరిస్తే షూటింగు పార్టు పూర్తవుతుందని తెలియజేశారు.

చిరంజీవి సరసన కాజల్ నటించగా .. చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వినోదం .. సందేశం కలగలిసిన ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.