Nara Lokesh: మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ఏపీ సీఎం జగన్ తీరు: నారా లోకేశ్

  • సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
  • ఇప్పటివరకు పెన్షన్లు, జీతాలు అందలేదు 
  • భారతి సిమెంట్ కు అధిక ధర చెల్లించారు 
  • పకోడీ పేపర్ అంటూ సాక్షిపై వ్యాఖ్యలు
Nara Lokesh criticizes CM Jagan agains

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా ఉందని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది అవ్వాతాతలకు పింఛన్లు లేవని, రిటైర్ట్ ఉద్యోగులకు పింఛను ఇంకా ఖాతాల్లో పడలేదని, ఉద్యోగులకు ఒకటో తేదీన అందాల్సిన జీతాలు ఇంకా అందనేలేదని, ప్రాణాలు కాపాడే 108 సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని వివరించారు.

ఫ్రంట్ లైన్ యోధులైన పారిశుద్ధ్య కార్మికులు తమ పెండింగ్ వేతనాలు అడిగితే సీఎం జగన్ వారిని అరెస్ట్ చేయించారని విమర్శించారు. కానీ, తన సొంత పకోడీ పేపర్ సాక్షికి మాత్రం సీఎఫ్ఎంఎస్ నుంచి ఇవాళ రూ.16.87 కోట్లు విడుదల చేశారని లోకేశ్ ఆరోపించారు.

"జగన్ రెండేళ్ల పాలనలో ఏపీ ప్రజలు అన్నమో రామచంద్రా అని అల్లాడుతుంటే, తన అక్రమాస్తుల మానస పుత్రిక సాక్షికి యాడ్స్ పేరుతో ఇప్పటిదాకా రూ.220 కోట్లు కట్టబెట్టారు. అంతేకాదు, పీసీబీ దాడులతో ఇతర సిమెంట్ కంపెనీలను భయపెట్టి తన భార్య భారతి సిమెంటు 2,28,370.14 మెట్రిక్ టన్నులను ఏపీ ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. ఇతర సంస్థల సిమెంటు కంటే అధిక ధర చెల్లించారు. అటు, కృష్ణా జలాలను సరస్వతి పవర్ కంపెనీకి ఎంతో చౌకగా కేటాయించుకున్నారు. ఏ1 జగన్ పదవులు, నీళ్లు, నిధులు, వైన్-మైన్, ల్యాండ్-శాండ్, జేట్యాక్స్ పేరుతో అన్నీ దోచుకుని ప్రజలకు అప్పులు-తిప్పలు మిగిల్చారు" అంటూ ధ్వజమెత్తారు.

More Telugu News