సమాచారం లీక్ చేస్తున్నారంటూ... ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

04-08-2021 Wed 16:04
  • ముగ్గురు ఉద్యోగులపై అభియోగాలు
  •  ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక సహాయ కార్యదర్శి సస్పెన్షన్ 
  • హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు
AP Govt supends three officials from finance department

ఏపీ ఆర్థికశాఖలో సమాచారం లీక్ కలకలం చెలరేగింది. కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు. సస్పెండైన వారిలో కె.వరప్రసాద్, డి.శ్రీనుబాబు ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులు కాగా, నాగులపాటి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి. ఈ ముగ్గురిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

వీరు ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ముగ్గురు ఉద్యోగులు మీడియాకు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సమాచారం చేరవేస్తున్నారని, అందుకే వీరిపై చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.