England: టీమిండియాతో తొలి టెస్టు... టాస్ గెలిచిన ఇంగ్లండ్

  • భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
  • నేటి నుంచి ట్రెంట్ బ్రిడ్జిలో తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • నలుగురు పేసర్లతో బరిలో దిగుతున్న భారత్
England won the toss against Team Indian in Trent Bridge

నేటి నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సమరం జరగనుంది. ఈ క్రమంలో నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం తొలి టెస్టుకు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

సొంతగడ్డపై సత్తా చాటాలని జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు తహతహలాడుతోంది. కిందటిసారి భారత్ లో పర్యటించినప్పుడు ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అగ్రశ్రేణి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు తప్ప, ఇంగ్లండ్ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. అనుభవజ్ఞులు, యువకుల సమ్మిళితంగా ఆ జట్టు బరిలో దిగుతోంది.

ఇక భారత జట్టు గతంలో ఆస్ట్రేలియా జట్టుకు వారి గడ్డపైనే ఓటమి రుచిచూపించిన ఆటతీరును ఇంగ్లండ్ లోనూ ప్రదర్శించాలని కృతనిశ్చయంతో ఉంది. కరోనా బారినపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుదిజట్టులో స్థానం లభించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలో దిగుతోంది. బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ల పేస్ భారత పేస్ భారాన్ని మోయనున్నారు. స్పిన్ కోటాలో రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలో దిగే అవకాశాలున్నాయి.

More Telugu News