మెఘన్​ పుట్టినరోజుకి స్పెషల్ ‘నేకెడ్​​ కేక్’ను ఆర్డర్ ఇచ్చిన యువరాజు హ్యారీ​.. ధరెంతో తెలుసా?

04-08-2021 Wed 14:32
  • ఇవాళ మెఘన్ 40వ బర్త్ డే
  • తమ నివాసంలో కొద్ది మంది సమక్షంలో వేడుక
  • పోజీస్ అండ్ షుగర్స్ బేకరీలో కేక్ ఆర్డర్
Harry Orders Special Cake For Meghan Birth Day

బ్రిటన్ రాజకుటుంబం నుంచి వేరుపడ్డాక యువరాజు హ్యారీ, మెఘన్ మార్కెల్ దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఇవాళ మెఘన్ 40వ పుట్టినరోజు. శాంటా బార్బారాలోని వారి విలాసవంతమైన భవనంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నారు.

ఆమె పుట్టిన రోజుకు హ్యారీ ఓ స్పెషల్ కేకు తెప్పించారు. శాంటాబార్బారాలోని ఖరీదైన బేకరీ ‘పోజీస్ అండ్ షుగర్’ నుంచి ఓ ‘నేకెడ్ కేక్’ను ఆర్డర్ చేశారు. ‘నేకెడ్ కేక్స్’ తయారీలో ఆ బేకరీ దిట్ట. అంటే కేకు లోపలి లేయర్లు (పొరలు) కనిపించేలా దానిపై ఐసింగ్ చేయడం, ఆ కేకును తాజా తాజా పూలతో అలంకరించడం దాని స్పెషాలిటీ.


పోజీస్ అండ్ షుగర్స్ వెబ్ సైట్ ప్రకారం మెఘన్ బర్త్ డే కోసం ఆర్డర్ ఇచ్చిన కేకు ధర సుమారు 225 డాలర్లట. అంటే దాదాపు రూ.16,700. వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం మూడు అంచెలుగా ఉండే ఆ కేకును 30 మంది అతిథులకు సర్వ్ చేయొచ్చు. అయితే, మెఘన్ పుట్టిన రోజుకు 65 మంది అతిథులను ఆహ్వానించారు. అంటే వెబ్ సైట్ లో చూపించిన కేకు కన్నా అది రెట్టింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం ఆ కేకు ధర సుమారు రూ.33 వేల దాకా ఉండే అవకాశం ఉంటుంది.

కాగా, ఆమె పుట్టినరోజు వేడుకకు టెన్నిస్ స్టార్ ప్లేయర్ సెరీనా విలియమ్స్, అమల్ క్లూనీ వంటి వారు వస్తారని తెలుస్తోంది. గతంలో కిమ్ కార్డాషియాన్, జెన్నీఫర్ యానిస్టన్, టామ్ క్రూజ్ వంటి మహామహుల ఈవెంట్ల బాధ్యతను చూసిన కొలిన్ కోవీనే మెఘన్ బర్త్ డే వేడుకులను నిర్వహిస్తారట.