AP High Court: కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా?: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  • ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ
  • తమ ఆదేశాలు పాటించకపోవడంపై ఆగ్రహం
  • కోర్టుకు సమాధానం చెప్పలేకపోయిన ద్వివేది
  • తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా
High Court asks state govt on pending bills

ఏపీలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వెలిబుచ్చింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలియదా? అంటూ నిలదీసింది.

బిల్లులపై విజిలెన్స్ విచారణలో తేలిన అంశాలు ఏమిటని ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించింది. కోర్టు అడిగిన మేరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో హైకోర్టు ధర్మాసనం మరింత అసహనానికి లోనైంది. విచారణలో ఉన్న అంశాలపై తగినంత సమాచారం లేకుండా ఎలా వస్తారని మొట్టికాయలు వేసింది.

అటు, ఇవాళ్టి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రాకపోవడంపైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

అంతకుముందు వాదనల సందర్భంగా.... ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇప్పటిదాకా రూ.413 కోట్లు చెల్లించామని, మరో 4 వారాల్లో రూ.1.117 కోట్లు చెల్లిస్తామని తెలిపారు.

అయితే, ప్రభుత్వం బిల్లుల కోసం చెల్లించింది రూ.40 కోట్లేనని ఈ పిటిషర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఏ గ్రామ పంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News