మరో ఐదు నెలలు లేవలేను.. నడువలేను: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సినీ నటి యషికా ఆనంద్

04-08-2021 Wed 13:08
  • తుంటి, కుడికాలికి ఆపరేషన్లు
  • ఇన్ స్టాలో యషిక భావోద్వేగ పోస్ట్
  • మలమూత్రాదులూ బెడ్ పైనేనని విచారం
Cant Walk and Stand For next 5 Months Say South Actress

తాను మరో ఐదు నెలలు లేవలేనని, నడవలేనని దక్షిణాది నటి యషికా ఆనంద్ ఆవేదన వ్యక్తం చేసింది. తన తుంటి ఎముక, కుడి కాలు విరిగిందని చెప్పిన ఆమె.. ఈమధ్యే శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని పేర్కొంది. గత నెల 24న చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు హైదరాబాద్ కు చెందిన పావని మరణించగా, యషికాకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సంఘర్షణను ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది.

‘‘నా తుంటి, కుడి కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం ఆపరేషన్లు అయిపోయాయి. మరో ఐదు నెలలు నేను లేవలేను. నడవలేను. అన్నీ బెడ్ మీదే చేయాల్సి వస్తోంది. చివరికి మలమూత్ర విసర్జనలూ బెడ్ మీదే జరిగిపోతున్నాయి. ఎటూ తిరగలేకపోతున్నాను. నా వెన్ను విరిగినట్టుంది. అదృష్టం కొద్దీ నా ముఖానికి ఏమీ కాలేదు. ఓ రకంగా నాకు ఇది పునర్జన్మే అయినా మానసికంగా, శారీరకంగా నేను గాయపడ్డాను. దేవుడు నాకు సరైన శిక్షే వేసినా.. నేను పోగొట్టున్న దాని కన్నా ఎక్కువేమీ కాదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తాను మద్యం తాగి కారు నడిపానన్న వార్తలపైనా ఆమె స్పందించింది. చట్టం ఎవరికైనా ఒకటేనని పేర్కొంది. తానేమీ తాగలేదన్న విషయాన్ని పోలీసులే నిర్ధారించారని చెప్పింది. తాను ఒకవేళ తాగి ఉంటే.. కటకటాల వెనక ఉండేదాన్నని, ఆసుపత్రిలో కాదని వ్యాఖ్యానించింది. కొందరు కల్తీ మనుషులు.. నకిలీ వార్తలను ఎప్పటి నుంచో వ్యాపింపజేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన విషయమని ఆమె తెలిపింది. సంచలనాల కోసం కొన్ని మీడియా సంస్థలు కల్పిత కథలను ప్రసారం చేస్తున్నాయంది. రెండేళ్ల క్రితం పరువు నష్టం దావా వేసినా ఇలాంటి మనుషులు అసలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయిన అమ్మాయి కుటుంబంపై కొంచెమైనా మానవత్వం చూపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఇవాళ యషిక పుట్టిన రోజు. అయితే, తాను ఆ పుట్టిన రోజును జరుపుకోవట్లేదని రెండ్రోజుల క్రితం వెల్లడించింది. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని, తాను బతికున్నంత కాలం నేరం చేశానన్న భావన వెంటాడుతుందని ఆమె పేర్కొంది. నన్ను బతికించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలో.. లేదంటే మంచి స్నేహితురాలిని తీసుకెళ్లిపోయినందుకు దేవుడిని తిట్టాలో అర్థం కావట్లేదంది. 'ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి నీ కుటుంబాన్ని నెట్టినందుకు సారీ పావని' అంటూ పోస్ట్ పెట్టింది.