అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యారాయ్​ ను దించేసింది.. ఇంటర్నెట్​ ను తెగ ఊపేస్తున్న ఆశిత: ఫొటోలివిగో

04-08-2021 Wed 12:10
  • పాటల అనుకరణలతో వీడియోలు
  • 26.5 వేల మంది ఫాలోవర్లు
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఆమె సొంతూరు
Aishwarya Doppelganger Sets Internet On Fire

భూమ్మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు  ఉంటారంటారు. కొందరిని చూస్తుంటే పెద్దలు చెప్పిన ఆ మాట నిజమేననిపిస్తుంటుంది. ఎలాంటి రక్త సంబంధమూ లేకపోయినా.. కొందరు కొందరిని దింపేస్తుంటారు. ఒడ్డూపొడుగు, రూపు రేఖల్లో ఏ మాత్రం తేడా రాదు.

ఇదిగో ఈ అమ్మాయి కూడా అంతే. అచ్చం బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను దించేసినట్టు లేదూ! ఆ అమ్మాయి పేరు ఆశితా సింగ్ రాథోడ్. ఇన్నాళ్లూ సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్న ఆశిత.. ఒక్కసారిగా ‘టాక్ ఆఫ్ ద ఇంటర్నెట్’గా మారిపోయింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆమె చిన్న చిన్న వీడియోలు, బాలీవుడ్ పాటలకు అనుకరణలు, సంప్రదాయ, మోడర్న్ వస్త్రధారణలతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ తన ఫ్రెండ్స్ ను అలరించేది.


అలాఅలా ఆమెను చూసిన కొందరు నెటిజన్లు.. అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉందే అనుకుంటూ ఇన్ స్టాలో వైరల్ చేశారు. అలా ఇప్పటిదాకా ఆమెకు ఇన్ స్టాలో 26,500 మంది ఫాలోవర్లు జమయ్యారు. మంగళవారం కూడా ఆశిత తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఐశ్వర్యారాయ్ నటించిన 2002 నాటి దేవదాస్ సినిమాలోని  ‘సిసిలా యే చాహత్ కా’ అనే పాటను అనుకరించిన వీడియోను పోస్ట్ చేసింది.


ఆ వీడియోలు బాలీవుడ్ డైరెక్టర్ల దాకా చేరాయో? లేదో! అవును మరి, వారి కంట పడితే ఇదిగో ఆఫర్ అంటూ వెంట పడరా ఏంటీ! కాగా, అంతకుముందు అమానా ఇమ్రాన్, అమాండా సేఫ్రైడ్, అమృత సాజు, మహ్లాగా జబేరి, మానసి నాయక్, మిష్తీ చక్రవర్తి, స్నేహా ఉల్లాల్ లు ఐశ్వర్యారాయ్ ను పోలి ఉన్నవారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఎక్కడో అక్కడ వారికి, ఐశ్వర్యకు కొంచెమైనా తేడా ఉంది. కానీ, ఆశిత మాత్రం అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యరాయ్ ను దించేసింది.