పూర్తిస్థాయి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

04-08-2021 Wed 08:52
  • కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్
  • నిన్ననే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బోర్డులు
  • హాజరు కాని తెలంగాణ ప్రభుత్వం
Telangana govt writes letter to krishna river board

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణాబోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణాబోర్డు కార్యదర్శికి లేఖ రాశారు.

 కాగా, సమన్వయ కమిటీ సమావేశానికి ముందు పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఇప్పుడు ఇదే విషయమై కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. అయితే, ఈ రెండు బోర్డులు నిన్ననే సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఈ సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరు కాలేదు.