Amararaja: 'అమరరాజా ఫ్యాక్టరీ' వల్ల ఆ ప్రాంతమంతా విషతుల్యం అవుతోంది.. మేమే వెళ్లిపొమ్మన్నాం: సజ్జల స్పందన

AP Govt response on amararaja batteries
  • అమరరాజా కంపెనీతో ప్రజల ప్రాణాలకు ముప్పు
  • వారు వెళ్లిపోవడం కాదు, మేమే పొమ్మన్నాం
  • కంపెనీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదన్న అటవీశాఖ ముఖ్యకార్యదర్శి
  • వెళ్లిపోవాలని మేం కోరుకోవడం లేదన్న మంత్రి బొత్స
చిత్తూరు జిల్లా తిరుపతిలోని అమరరాజా బ్యాటరీస్ తమిళనాడుకు తరలిపోనుందన్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై స్పందిస్తూ .. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదని, తామే పంపేస్తున్నామని చెప్పుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీ వల్ల ఆ ప్రాంతమంతా విషతుల్యం అవుతోందని, అక్కడి నీళ్లలో ప్రాణాలకు హాని కలిగించే విష పదార్థాలు ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి కూడా చెప్పిందని పేర్కొన్నారు.

కాబట్టి వాళ్లు పోవడం కాదని, ప్రభుత్వమే పొమ్మని చెబుతోందని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం కానీ, ప్రభుత్వ జోక్యం కానీ ఏమీ లేదన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని పరిశ్రమలను మాత్రమే ఆహ్వానిస్తామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్  ఇదే కోరుకున్నారని సజ్జల అన్నారు. ఫ్యాక్టరీ సుబ్బారెడ్డిదైనా, ఎల్లారెడ్డిదైనా, చివరికి సజ్జల రామకృష్ణారెడ్డిదైనా జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని అన్నారు. ఇంకా చాలామందిపై కేసులు ఉంటాయని సజ్జల హెచ్చరించారు.

అటవీశాఖ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్ కూడా ఇలానే స్పందించారు. అమరరాజా ఫ్యాక్టరీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదని అన్నారు. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతోనే అమరరాజా బ్యాటరీస్‌ను మూసేయమని ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. తొలుత లోపాలు సరిచేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ఉత్పత్తిని నిలిపేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ లోపాలు సరిచేసుకోకపోవడంతో మూసివేత ఉత్తర్వులు ఇచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేశామని వివరించారు. హైకోర్టు ఆదేశాలతో తనిఖీల కోసం వెళ్లిన అధికారులను గేట్లు మూసి అడ్డుకున్నారని, దీనిపై కేసు నమోదైందని అన్నారు.  
 
అమరరాజా వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లిపోవాలని తాము అనుకోవడం లేదని, కానీ లాభం ఎక్కడ ఉంటే, వ్యాపారులు అక్కడకు వెళ్తారని అన్నారు. వ్యాపారం చేసుకునే వారికి ఏ రాష్ట్రమైతే ఏంటని ప్రశ్నించారు. అమరరాజాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని మంత్రి పేర్కొన్నారు.
Amararaja
Tirupati
Tamil Nadu
Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy
Botsa

More Telugu News