పాకిస్థాన్ లో కరోనా ఫోర్త్ వేవ్.. భారీగా పెరుగుతున్న కేసులు!

03-08-2021 Tue 19:02
  • పాక్ లో ఆందోళన కలిగిస్తోన్న డెల్టా వేరియంట్
  • పాజిటివిటీ క్రమంగా పెరుగుతోందన్న మంత్రి అసద్ ఉమర్
  • పలు నగరాల్లో మళ్లీ ఆంక్షల విధింపు
Covid fourth wave started in Pakistan

మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మన దాయాది దేశం పాకిస్థాన్లో అప్పుడే ఫోర్త్ వేవ్ ప్రారంభమయిందట. ఈ నేపథ్యంలో పాక్ లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ సందర్భంగా పాక్ ప్రణాళికాశాఖ మంత్రి అసద్ ఉమర్ మాట్లాడుతూ, డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కొత్త కేసులతో పాటు, పాజిటివిటీ శాతం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే సిటీల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ముల్తాన్, అబోట్టాబాద్, ఫైసలాబాద్, మీర్పూర్, హైదరాబాద్, గిల్గిత్, స్కర్దు తదితర నగరాల్లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో 8 గంటల లోపే వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 50 శాతం ఉద్యోగులతో విధులను నిర్వహించాలని చెప్పారు. ప్రజా రవాణా వాహనాల్లో 50 శాతం మందికే అనుమతి ఉంటుందని అన్నారు.