చిరూకి కథ చెప్పిన మారుతి?

03-08-2021 Tue 17:47
  • దర్శకుడిగా మారుతికి క్రేజ్ 
  • గీతా ఆర్ట్స్ తో మంచి సంబంధాలు 
  • ఆ బ్యానర్లో పెద్ద సినిమా చేసే ఛాన్స్ 
  • కథ నచ్చిందన్న చిరంజీవి?  
Maruthi another movie with Chiranjeevi

చిన్న హీరోలతో .. చిన్న సినిమాలతో మారుతి తన కెరియర్ ను మొదలుపెట్టాడు. యూత్ కి నచ్చే కథలను ఎక్కువగా చేస్తూ వెళ్లిన ఆయన, ఆ తరువాత లవ్ కి ఎమోషన్ ను ..  కామెడీని మిక్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చేలా చేశాడు. ఆ తరువాత నుంచి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

నాని .. శర్వానంద్ వంటి యువ కథానాయకులతో  హిట్లు ఇచ్చిన మారుతి, సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ తోను సినిమా చేశారు. ఇక ఇప్పుడు ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఆయన మూడు కథలను సిద్ధం చేసుకున్నాడట. అందులో ఒక కథకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా చెప్పుకుంటున్నారు.

మారుతికి గీతా ఆర్ట్స్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన అల్లు అరవింద్ ద్వారా ఆయన చిరంజీవికి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది. చిరంజీవికి ఈ కథ నచ్చిందని అంటున్నారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయినా అందుకు చాలా సమయమే పడుతుంది.