సీక్వెల్ దిశగా అడివి శేష్ 'గూఢచారి'

03-08-2021 Tue 17:20
  • 'గూఢచారి'తో పడిన హిట్ 
  • నేటితో 'గూఢచారి'కి మూడేళ్లు  
  • 'మేజర్' తరువాత సినిమా అదేనట    
Goodachari movie sequel update

మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో 'గూఢచారి' ఒకటి. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది.

అనుక్షణం ఉద్వేగం .. ఉత్కంఠతో నడిచే ఈ సినిమాలో అడివి శేష్ జోడిగా శోభితా ధూళిపాళ్ల అలరించింది. కీలకమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. జగపతిబాబు మెప్పించారు. కథాకథనాలు .. టేకింగ్ పరంగా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. అభిషేక్ పిక్చర్స్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై అడివి శేష్ స్పందించాడు.
 
"ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయ్యాయి .. ఆగస్టు నెల నాకు ఎంతో స్పెషల్ .. గూఢచారి మరో మిషన్ కి రెడీ అవుతున్నాడు. 'గూఢచారి 2'పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది" అని చెప్పుకొచ్చాడు. 'మేజర్' తరువాత అడివి శేష్ చేయబోయే సినిమా 'గూఢచారి' సీక్వెల్ అన్నమాట.