Bombay High Court: రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా ఇంట్లోనే ఉండమంటే ప్రయోజనం ఏమిటి?: బాంబే హైకోర్టు

  • వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలంటే అర్థం ఏముంది?
  • కరోనా తొలి నాళ్లకు, ఇప్పటి పరిస్థితికి తేడా ఉంది
  • వ్యాక్సిన్లు తీసుకుని ఇంట్లోనే కూర్చోవాలని ఎవరూ కోరుకోరు
What is use of taking Corona vaccine if you ask people to sit in home asks Bombay high court

కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో జనాలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కోట్లాది మంది భారతీయులు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నారు.

మరోవైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూటి ప్రశ్నలను సంధించింది. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశిస్తున్నప్పుడు... వ్యాక్సిన్లు తీసుకుని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది.

లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు లాయర్లను అనుమతించాలంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... కరోనా ప్రారంభమైన పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషనే దీనికి కారణమని తెలిపింది.

అయితే, వ్యాక్సిన్లు తీసుకున్నవారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని... లేకపోతే, వ్యాక్సిన్ తీసుకుని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుని కూడా ఇంట్లోనే కూర్చోవాలని ఎవరూ అనుకోరని వ్యాఖ్యానించింది. ఏదో ఒక సమయంలో లాయర్లు కోర్టుకు రావాల్సి ఉంటుందని చెప్పింది.

వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి పూర్తిగా సడలింపులు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఆలోచన ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇంట్లోనే కూర్చుంటే ఆర్థికపరంగా, పనిపరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పింది. లోకల్ రైళ్లలో ప్రయాణాలకు అనుమతిస్తే రోడ్లపై జనాల రద్దీ తగ్గుతుందని తెలిపింది. దీనికి సహకరించేందుకు రైల్వేలు కూడా సిద్ధంగా ఉన్నాయని... రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలను ప్రారంభించాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణ ఈ నెల 5న కొనసాగుతుందని చెప్పింది.

More Telugu News