India: 11 ఏళ్ల ఈ భారత సంతతి చిన్నారి.. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒక అమ్మాయి!

11 Year Old Indian American Girl Is One Of The Brightest In The World
  • జాన్స్ హాప్కిన్స్ పరీక్షల్లో అసమాన ప్రతిభ
  • గ్రేడ్ 5లోనే గ్రేడ్ 8కు సరిసమాన మార్కులు
  • వర్సిటీ హై ఆనర్స్ అవార్డ్స్ కు ఎంపిక
ఆ అమ్మాయి వయసు 11 ఏళ్లు. ఆ పసిప్రాయంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో అదరగొట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి జాబితాలో తనకంటూ ఓ చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో ఆ చిన్నారి ఒకరని అమెరికాలోని అత్యున్నత యూనివర్సిటీ అయిన జాన్స్ హాప్కిన్స్ ఇవ్వాళ ప్రకటించింది. ఆ అమ్మాయి పేరు నటాషా పెరి.

భారత సంతతికి చెందిన ఆ చిన్నారి.. న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్మియర్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతోంది. అయితే, జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించే ట్యాలెంట్ సెర్చ్ లో నటాషా పాల్గొంది. సీటీవై నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (యాక్ట్)లో అదరగొట్టేసింది. అమెరికాలో కాలేజీల ప్రవేశాల కోసం ఈ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటారు.

ఈ పరీక్షలకు 84 దేశాలకు చెందిన 19 వేల మంది హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పరీక్షలకు ‘గ్రేడ్ 5 (ఐదో తరగతి)’ చదువుతున్న నటాషా కూడా హాజరైంది. అయితే, అడ్వాన్స్ డ్ గ్రేడ్ 8కు నిర్వహించే పరీక్షలకు సరిసమానంగా ఆమె మార్కులు తెచ్చుకుంది. 90 శాతం పర్సంటైల్ ను సాధించింది. దీంతో ఆమెను సీటీవై ‘హై ఆనర్స్ అవార్డ్స్’కు ఎంపిక చేసింది.

ఈ విజయంతో తాను మరింత స్ఫూర్తి పొందానని, భవిష్యత్ లో మరిన్ని సాధిస్తానని నటాషా చెప్పింది. గూగుల్ సెర్చ్, జేఆర్ఆర్ టోకీన్స్ నవలలు తనకు మేలు చేశాయంది. కాగా, అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేర్చుకోవాలనే వారి తాపత్రయం చాలా ముచ్చటగా ఉందని సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్జీనియా రోచ్ చెప్పారు. వారు స్కూల్, కాలేజ్, ఉన్నత చదువుల్లో మరింతగా ఎదిగేందుకు మరింత సహకారం అందిస్తామన్నారు.
India
Indian American
Natasha Peri
Johns Hopkins University

More Telugu News