ఎంపీగా కొనసాగుతా: మాజీ మంత్రి బాబుల్ సుప్రియో

02-08-2021 Mon 21:24
  • ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరణ
  • మంత్రివర్గం నుంచి సుప్రియోకు ఉద్వాసన
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రియో ప్రకటన
  • తాజాగా భవితవ్యంపై వివరణ
Babul Supriyo says he will continue as MP

కేంద్రమంత్రి వర్గ విస్తరణ వేళ సహాయమంత్రి పదవి కోల్పోయిన బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. అయితే, తాను ఎంపీగా కొనసాగుతానని బాబుల్ సుప్రియో ఇవాళ వెల్లడించారు. తద్వారా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ నియోజకవర్గం నుంచి రాజ్యాంగబద్ధమైన ఎంపీ పదవిలో కొనసాగుతానని వివరించారు. ఒకవేళ అక్కడ కూడా రాజకీయాలు ఉంటే ఎంపీ పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు.

తాను మరే ఇతర రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని, భద్రతా సిబ్బందిని కూడా పంపించివేస్తానని బాబుల్ సుప్రియో వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం సుప్రియో ఈ వ్యాఖ్యలు చేశారు.