నాగబాబు వ్యాఖ్యలు చాలా బాధించాయి: 'మా' అధ్యక్షుడు నరేశ్

02-08-2021 Mon 21:08
  • 'మా' అధ్యక్ష ఎన్నికలపై నరేశ్ స్పందన
  • ప్రస్తుతం 'మా' అధ్యక్షుడుగా కొనసాగుతున్న నరేశ్
  • ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని వెల్లడి
  • చిరంజీవి తన మద్దతు ఎవరికో చెప్పలేదని వివరణ
MAA President Naresh responds to Nagababu comments

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ఇటీవలి పరిణామాలపై స్పందించారు. 'మా' విషయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. 'మా' మసకబారింది అని, ఏకగ్రీవం చేస్తే గొంతు నులిమేసినట్లేనని నాగబాబు వ్యాఖ్యానించారని అన్నారు. ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో తప్పులేదని, కానీ చెడు ఉంటే చెవిలో చెబుదాం, మంచి ఉంటే మైక్ లో మాట్లాడుదాం అని చిరంజీవి అన్నారని గుర్తు చేశారు.

అదే సమయంలో 'మా' గురించి ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవచ్చని నియమావళిలో ఉందని నరేశ్ వెల్లడించారు. 'మా' గురించి చెడుగా మాట్లాడేవారి సంగతి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు.

ఇక, ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తామని చెప్పింది నాగబాబు మాత్రమేనని, చిరంజీవి కాదు కదా అని నరేశ్ వ్యాఖ్యానించారు. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో తన మద్దతు ఎవరికన్నది చిరంజీవి ఇంకా చెప్పలేదని అన్నారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున, 'మా' ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చెప్పలేమని అభిప్రాయపడ్డారు.

నాగబాబు ఏకగ్రీవాన్ని వ్యతిరేకిస్తుండడం సరికాదని, బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవం జరిగితే నష్టమేంటని ప్రశ్నించారు.