Chiranjeevi: 30 ఏళ్ల కిందట తనతో పనిచేసిన కోడైరెక్టర్ ను ఆదుకున్న చిరంజీవి

  • లంకేశ్వరుడు చిత్రానికి కోడైరెక్టర్ గా పనిచేసిన ప్రభాకర్
  • ఇటీవల ఓ చిత్రం తీసి నష్టపోయిన వైనం
  • పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు
  • చిరంజీవి ఆర్థిక సహకారం
Chiranjeevi helps Tollywood co director Prabhakar

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, వ్యక్తిగతంగానూ అనేక మందికి ఆర్థికసాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటుంటారు. తాజాగా ఓ కోడైరెక్టర్ ను చిరంజీవి ఆదుకున్న ఘటన వెల్లడైంది.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిరంజీవి దాదాపు 30 ఏళ్ల కిందట లంకేశ్వరుడు చిత్రంలో నటించారు. ఆ సినిమాకు ప్రభాకర్ కోడైరెక్టర్ గా పనిచేశారు. ప్రభాకర్ ఇటీవల హెల్ప్ లైన్ అనే చిత్రం తీసి ఆర్థికంగా నష్టపోయారు. అయితే, ప్రభాకర్ కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి రెండేళ్లు కావొస్తున్నా, ఫీజులు చెల్లించకపోవడంతో ఇప్పటికీ ఆ కుర్రాడి సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉన్నాయి. ఇక కుమార్తె బీబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాల్సి ఉంది. రెండున్నర లక్షల మేర ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చివరి అవకాశంగా ప్రభాకర్... చిరంజీవిని కలిశారు. 3 దశాబ్దాల కిందట లంకేశ్వరుడు చిత్రానికి పనిచేసినప్పుడు ఎంత గౌరవించారో, తనను ఇప్పుడూ అంతే గౌరవించారని ప్రభాకర్ వెల్లడించారు. తన సమస్యలు ఆయనకు వివరించగానే, ఎంతో సానుభూతితో స్పందించి ఫీజులు చెల్లించేందుకు సహకారం అందించారని తెలిపారు.

చిరంజీవి మాత్రమే కాకుండా, రామ్ చరణ్, ఆయన సిబ్బంది కూడా సాయపడ్డారని ప్రభాకర్ వివరించారు. కాలేజీలో చిరంజీవి సాయం చేశారని చెప్పగానే, యాజమాన్యం నుంచి వచ్చిన స్పందన అనూహ్యమని, వెంటనే హాల్ టికెట్ ఇచ్చి తన కుమార్తెను పరీక్షలకు అనుమతించారని సంతోషంగా చెప్పారు.

More Telugu News