Nitish Kumar: బీజేపీ మిత్రపక్షాల్లోనూ పెగాసస్ పై అసంతృప్తి... దర్యాప్తు కోరుతున్న నితీశ్ కుమార్

  • దేశంలో పెగాసస్ కలకలం
  • పార్లమెంటులోనూ భగ్గుమన్న వ్యవహారం
  • అభిప్రాయాలు వెల్లడించిన బీహార్ సీఎం
  • వాస్తవాలు ప్రజల ముందుంచాలని డిమాండ్
Bihar CM Nitish Kumar demands probe on Pegasus row

పెగాసస్ స్పై వేర్ అంశంలో విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో, బీజేపీ మిత్రపక్షాల్లోనూ నిరసన గళం వినిపిస్తోంది. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరుతున్నారు. ఇలాంటి అంశాలు ప్రజలను కలవరపాటుకు గురిచేయడం, ప్రజలు బాధపడడం జరగకూడదని భావిస్తున్నాననీ, అందుకే ఈ వ్యవహారం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలనీ డిమాండ్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పెగాసస్ స్పై వేర్ తో అనేక దేశాల ప్రభుత్వాలు విపక్ష నేతలు, పాత్రికేయులు, ఇతర రంగాల ప్రముఖులపై నిఘా వేస్తున్నాయని 17 మీడియా సంస్థలతో కూడిన కన్సార్టియం సంచలన ఆరోపణలు చేయడంతో, భారత్ లోనూ ప్రకంపనలు చెలరేగాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ పెగాసస్ అంశం ప్రభావం చూపింది. అక్రమంగా తాము ఎవరి సంభాషణలపైనా నిఘా వేయలేదని కేంద్రం చెబుతున్నా, విపక్షాలు మాత్రం ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో, బీజేపీ మిత్రుడైన నితీశ్ కుమార్ స్పందిస్తూ, ఇలాంటి వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. "ఫోన్ టాపింగ్ జరిగిందన్న ఆరోపణలు కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటులోనూ ప్రస్తావనకు రావడమే కాకుండా, మీడియాలోనూ ప్రముఖంగా దర్శనమిస్తోంది. దీనిపై చర్చ జరగాల్సిందే... సమగ్ర పరిశోధన చేపట్టి అన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిందే" అని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.

More Telugu News