ప్రభాస్ సినిమాలో ముఖ్య పాత్రలో ఎయిర్ టెల్ చిన్నది!

02-08-2021 Mon 16:36
  • ఎయిర్ టెల్ యాడ్ ద్వారా సాషా చెత్రీకి గుర్తింపు 
  • గతంలో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో నటించిన వైనం
  • ప్రభాస్ 'రాధేశ్యామ్'లో ముఖ్య పాత్రలో సాషా   
Airtel model to play key role in Prabhas movie

సినిమా తారల్లో చాలా మంది మోడలింగ్ రంగం నుంచి వచ్చిన వాళ్లే వుంటారు. వివిధ కంపెనీల ఉత్పత్తులకు మోడలింగ్ చేయడం ద్వారా నలుగురి దృష్టిలోనూ పడి, అవకాశాలు అందుకుంటూ వుంటారు. సాషా చెత్రీ కూడా అలా మోడలింగ్ నుంచే సినిమాల్లోకి వచ్చింది. ముఖ్యంగా ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటన ద్వారా సాషాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. తన అందం.. నటనతో ఆ యాడ్ కే ఈ అమ్మాయి కొత్త అందాన్ని తెచ్చింది. తాజాగా ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా ఈ చిత్రం రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో సాషా ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈమె పాత్ర కథలో కీలకమైనదని, ఆమెకు మంచి గుర్తింపు వస్తుందనీ అంటున్నారు.

అన్నట్టు, సాషా గతంలో కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది. ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో ఆమె నటించింది. అయితే, ఆ సినిమా ఆమెకు గుర్తింపును మాత్రం తేలేదు. అందుకే, ఇప్పుడు 'రాధేశ్యామ్'పై ఈ చిన్నది ఆశలు పెట్టుకుంది.