ఈటల రాజేందర్ కు ఆపరేషన్.. పాదయాత్ర నిలిచిపోయే అవకాశం!

02-08-2021 Mon 16:25
  • పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన ఈటల
  • కాలికి నొప్పి రావడంతో ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు
  • వారం రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్న ఈటల
Etela Rajender undergone Knee operation

బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. ఆయన మోకాలికి ఆపరేషన్ జరిగింది. పాదయాత్ర సందర్భంగా ఈటల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. అస్వస్థత నుంచి కోలుకున్న తరుణంలో ఆయనకు కాలునొప్పి వచ్చింది. దీంతో కాలుని పరీక్షించిన వైద్యులు... ఆయన మోకాలికి ఈరోజు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఈటల ఉండనున్నారు.

పది రోజుల తర్వాత డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఈటల తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఈటల పాదయాత్ర 12 రోజుల పాటు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఆయన యాత్ర 22 నుంచి 25 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే పాదయాత్ర నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈటల కోలుకున్న తర్వాత ఆయన పాదయాత్ర కొనసాగుందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి.