Shilpa Shetty: గడ్డు కాలాన్ని అనుభవించాను: తన భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి స్పందించిన శిల్ప శెట్టి

  • మీడియాతో పాటు, సొంత వ్యక్తులు కూడా అనవసర వ్యాఖ్యలు చేశారు
  • పోలీసులు, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
  • మా పిల్లల కోసమైనా కామెంట్ చేయడం ఆపేయండి
Shilpa Shetty first response after her husband Raj Kundras arrest

బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. జులై 19న కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మరోవైపు తన భర్త అరెస్టైన తర్వాత శిల్పా శెట్టి అధికారికంగా తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. చట్టాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా ఈ స్టేట్మెంట్లో శిల్ప తన గురించి తాను చెప్పుకున్నారు.

గత కొన్ని రోజులుగా అన్ని రకాలుగా తాను ఎంతో గడ్డు కాలాన్ని అనుభవించానని శిల్ప తెలిపారు. ఎన్నో పుకార్లు, ఆరోపణలు వెల్లువెత్తాయని చెప్పారు. తనపై మీడియాతో పాటు కొందరు సొంత వ్యక్తులు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారని, ఎంతో ట్రోల్ చేశారని చెప్పారు. తనను మాత్రమే కాకుండా, తన కుటుంబం మొత్తం బాధ పడేలా చేశారని అన్నారు. ఈ అంశంపై తాను ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదని... ఇకపై కూడా అలాగే ఉంటానని చెప్పారు. తన పట్ల ఎంతో అన్యాయంగా మాట్లాడుతున్నారని... అందుకే తాను మౌనంగానే ఉంటానని అన్నారు.

తనకు తప్పుడు విషయాలను ఆపాదించే ప్రయత్నం చేయవద్దని శిల్ప కోరారు. తన భర్తపై నమోదైన కేసుపై విచారణ జరుగుతోందని... తనకు ముంబై పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. చట్టపరంగా పోరాడేందుకు అవసరమైన అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా తమపై కామెంట్ చేయడం మానుకోవాలని... తమ పిల్లల ప్రైవసీ కోసమైనా కామెంట్ చేయడం ఆపేయాలని ఒక తల్లిగా కోరుతున్నానని అన్నారు.

గత 29 ఏళ్లుగా తాను ఎంతో కష్టపడి పని చేస్తున్నానని, తాను ఒక ప్రొఫెషనల్ అని శిల్ప చెప్పారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచారని... వారి నమ్మకాన్ని తాను ఏనాడూ కోల్పోయేలా చేయలేదని అన్నారు. ఈ కష్ట సమయంలో తన కుటుంబాన్ని, తన హక్కులను గౌరవించాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఏం జరిగిందనేది తేల్చి చెప్పాల్సింది మీడియా కాదని... చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాలని అన్నారు. చివరకు సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

More Telugu News