Raghu Rama Krishna Raju: మైనింగ్ గురించి మాట్లాడుతూ 'కేజీఎఫ్' కథలు చెప్పిన రఘురామ

Raghurama Krishna Raju interesting comments in mining issues
  • రఘురామ రోజువారీ మీడియా సమావేశం
  • అనేక అంశాలపై అభిప్రాయాల వెల్లడి
  • మైనింగ్ అంశాల ప్రస్తావన
  • ఎవరైనా వెళ్లి పరిశీలించవచ్చని వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం కొండపల్లి అక్రమ మైనింగ్ అంశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని విపక్ష నేతలు అంటున్నారని, అయితే, మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేశారు.

కొండపల్లిలో మైనింగ్ జరిగే చోట ఇతరులకు ప్రవేశం లేదు అని బోర్డులు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందని, ఒకవేళ విపక్ష నేతలు అక్రమ మైనింగ్ జరుగుతుందేమోనని అపోహ పడి ఉండొచ్చని అన్నారు. అందుకే వారిని గృహ నిర్బంధంలో ఉంచకుండా, మైనింగ్ జరిగే చోటకు వెళ్లనిస్తే అక్కడేం జరుగుతుందో వారికి తెలిసేదని, అక్రమ మైనింగ్ జరగకపోతే అక్కడేమీ లేదని వారే చెబుతారు కదా అని రఘురామ వ్యాఖ్యానించారు. వాళ్లేమీ పలుగులు, పారలు తీసుకుని వెళ్లి తవ్వరు కదా అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రఘురామ 'కేజీఎఫ్ చాప్టర్-1' సినిమాను ప్రస్తావించారు. దేశంలో 'బాహుబలి' తర్వాత అంత పెద్ద హిట్టయిన చిత్రం 'కేజీఎఫ్-1' అని తెలిపారు. ఈ సినిమాలో కోలార్ బంగారు గనుల్లో మైనింగ్ గురించి చూపించారని వెల్లడించారు. గోల్డ్ మైనింగ్ జరిగే చోటుకు ఎవరినీ అనుమతించరని, ఎవరైనా వెళితే చంపేస్తుంటారని వివరించారు. హీరో వెళ్లి ఏదో చేయడం, ఆ విధంగా సినిమా సాగిపోతుందని, ఇప్పుడు 'కేజీఎఫ్-2' కూడా వస్తోందని రఘురామ తెలిపారు.

అయితే, ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు తనను ఆకర్షించాయని, అవేంటంటే... కేజీఎఫ్-3, కేజీఎఫ్-4కు కూడా కథలు సిద్ధమయ్యాయని కొందరు పోస్టులు పెట్టారని అన్నారు. 'కేజీఎఫ్-3' చిత్రం మన్యం ఏరియాలో తీస్తారని, 'కేజీఎఫ్-4' చిత్రాన్ని కొండపల్లి అడవుల్లో తీస్తారని ఆ పోస్టుల సారాంశం అని తనదైన శైలిలో చెప్పారు. విశాఖ మన్యంలో లేటరైటు తవ్వకాల అంశాన్ని, కొండపల్లి మైనింగ్ అంశాన్ని ఈ విధంగా ప్రస్తావించారు. మరి క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని వ్యంగ్యంగా అన్నారు.

ఏమైనా మన పార్టీకి, నా పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా మాత్రం ఉండకూడదని అభిలషిస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ నా పార్టీ అనుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు.
Raghu Rama Krishna Raju
Mining
KGF
Kondapalli

More Telugu News