PV Sindhu: శభాష్ సింధు... టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం కైవసం

  • చైనా షట్లర్ పై నెగ్గిన సింధు
  • 21-13, 21-16తో సింధు జయభేరి
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
  • నిన్న సెమీఫైనల్లో ఓడిన సింధు
PV Sindhu wins bronze in Tokyo Olympics badminton

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. ఇవాళ చైనా తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. పతకం అంచనాల ఒత్తిడి మధ్య బరిలో దిగిన సింధు... ఎక్కడా తడబాటు లేకుండా బింగ్జియావోను వరుస గేముల్లో మట్టికరిపించింది. తొలి గేమును 21-13తో సొంతం చేసుకున్న తెలుగుతేజం, ఆపై రెండో గేమును 21-15తో సాధించింది. తద్వారా భారత త్రివర్ణ పతాకాన్ని టోక్యో ఒలింపిక్స్ లో రెపరెపలాడించింది. ఒలింపిక్ క్రీడల్లో సింధుకు ఇది రెండో పతకం. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు రజతం నెగ్గింది.

నిన్న జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు... చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. అయితే, కాంస్యం కోసం పోరులో నెగ్గి కోట్లాది భారతీయుల ముఖాల్లో సింధు ఆనందం నింపింది. కాగా, వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం నెగ్గిన తర్వాత భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇది రెండో పతకం.

More Telugu News