ట్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

01-08-2021 Sun 16:41
  • ట్రిపుల్ తలాక్ చట్టంపై ఒవైసీ వ్యాఖ్యలు
  • సమానత్వానికి వ్యతిరేకమని వెల్లడి
  • మహిళలు మరింత దోపిడీకి గురవుతారని ఆవేదన
  • ఈ చట్టాన్ని ముస్లింలు అంగీకరించరని వివరణ
Asaduddin Owaisi comments on Triple Talaq law

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ చట్టం నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ట్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆక్రోశించారు. అందుకే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్టు వెల్లడించారు. ఇది సమానత్వానికి వ్యతిరేకం అని, ముస్లింలను దుర్మార్గులుగా చూపించే ప్రయత్నమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కేవలం ముస్లిం మహిళల (హక్కుల) దినోత్సవాన్ని మాత్రమే జరుపుకుంటోందా? హిందు, దళిత, ఓబీసీ మహిళల సాధికారత అక్కర్లేదా? అని ఒవైసీ ప్రశ్నించారు.

ఈ ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల మేలు జరగకపోగా, ముస్లిం మహిళలు మరింత పీడిత పరిస్థితులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు రెట్టింపవుతాయని వివరించారు. కేసులు నమోదవుతాయేమో తప్ప, న్యాయం మాత్రం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అసలు, ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో ముస్లింలు ఎవరూ ఒప్పుకోరని ఒవైసీ స్పష్టం చేశారు.