అమ్మవారికి బంగారు బోనమెత్తి 'తెలంగాణ' మొక్కు తీర్చుకున్న విజయశాంతి

01-08-2021 Sun 15:52
  • ఏడేళ్ల కింద విజయశాంతి మొక్కు
  • ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు బోనం
  • మాట నిలుపుకున్న విజయశాంతి
  • ఈసారి బీజేపీని గెలిపించాలని ప్రార్థన
  • మరోసారి బంగారు బోనమెత్తుతానని మొక్కు
Vijayasanthi offers Golden Bonam to Jaganmatha

ఇవాళ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాదు పాతబస్తీలో కొత్త శోభ కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు కూడా బోనాలు సమర్పించేందుకు తరలిరావడంతో కోలాహలం మిన్నంటుతోంది. బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా లాల్ దర్వాజా సింహవాహినీ జగన్మాతకు బోనాలు సమర్పించారు. తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తానని ఏడేళ్ల కిందట మొక్కుకున్నానని చెప్పిన విజయశాంతి, ఆ మేరకు బంగారు కలశంతో బోనం తెచ్చానని వెల్లడించారు.

ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, అధికారంలోకి తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థించానని, బీజేపీ గెలిస్తే మరోసారి బంగారు బోనమెత్తుతానని అమ్మవారికి మొక్కుకున్నానని విజయశాంతి వెల్లడించారు. నియంతృత్వంలో అల్లాడిపోతున్న తెలంగాణలో ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని ఆమె ఉద్ఘాటించారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి శక్తిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. కాగా, విజయశాంతి వెంట బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.