8 ఏళ్ల తర్వాత తల్లయింది.. ఒకేసారి నలుగురికి జన్మనిచ్చింది!

01-08-2021 Sun 15:02
  • ఢిల్లీ మహిళకు ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం
  • అండాలు తక్కువవుండడంతో తల్లి కాలేకపోయిందన్న డాక్టర్
  • హార్మోన్ లోపం వల్లే సమస్య అని వెల్లడి
Woman Become Mother After 8 years

ఆ దంపతులకు పెళ్లయి 8 ఏళ్లు. కానీ, వారికి సంతానం కలుగలేదు. ఇప్పుడు ఆ బాధ, కొరతను తీరుస్తూ ఒకేసారి ఆమె నలుగురికి అమ్మయింది. టెస్ట్ ట్యూబ్ (ఐవీఎఫ్) ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 32 ఏళ్ల మహిళకు ఘాజియాబాద్ కు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితమే వివాహమైంది. కానీ, అప్పటి నుంచి వారికి సంతాన ప్రాప్తి లేదు.

బిడ్డలను కనేందుకు ఎన్నెన్నో మార్గాలను అన్వేషించారు. వైద్యుల వద్దకు వెళ్లారు. ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) వంటి పద్ధతుల్లో సంతానం కోసం ప్రయత్నించారు. కానీ, అవేవీ ఫలించలేదు. ఆమెలో అండాలు తక్కువగా ఉండడం వల్ల ఆమె తల్లి కాలేకపోయింది. చివరిగా ఢిల్లీలోని సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే సంతాన సాఫల్య ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ డాక్టర్ గౌరీ అగర్వాల్ దంపతులకు అన్ని పరీక్షలు చేసిన తర్వాత.. మహిళ అప్పటికే నాలుగు సార్లు ఐయూఐ ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు గుర్తించారు. అండాల ఉత్పత్తికి కారణమయ్యే యాంటీ ములేరియన్ హార్మోన్ స్థాయులు తక్కువగా ఉన్నాయని నిర్ధారించి ఆ దిశగా చికిత్స ప్రారంభించారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యం కలిగేలా చేశారు. అలా జులై 12న ఆమె ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. వారంతా క్షేమంగా ఉన్నారని డాక్టర్ గౌరీ చెప్పారు.