రూ.కోటి ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌!

01-08-2021 Sun 13:28
  • త‌ల్లిదండ్రులు మంద‌లించ‌డంతో చిన్నారి మ‌న‌స్తాపం
  • వారిని బెదిరించాల‌ని నిర్ణ‌యం
  • ల్యాప్ టాప్ నుంచి తండ్రికి మెసేజ్ పంపిన బాలిక‌
  • రూ.కోటి ఇవ్వ‌క‌పోతే కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరింపు
girl threats her father by sending message

కోటి రూపాయ‌లు ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటావంటూ త‌న తండ్రికి మెసేజ్ పంపింది 11 ఏళ్ల‌ ఓ బాలిక. ఆ మెసేజ్ ఎవ‌రు పంపారో తెలియక భ‌య‌ప‌డిపోయిన ఆ తండ్రి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు బాలికే త‌న తండ్రికి మెసేజ్ పంపింద‌ని గుర్తించారు.

ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌, శాలిమార్‌ గార్డెన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల ఆ అమ్మాయిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. వారిని భ‌య‌పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. తండ్రి ల్యాప్‌టాప్ తీసుకుని దాని నుంచే ఆయనకు మెసేజ్ పంపింది.

త‌న‌కు కోటి రూపాయ‌లు ఇవ్వాలని లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని గూండాల మాదిరిగా బెదిరించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెసేజ్ ఆయ‌న‌ ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించిన పోలీసులు బాలికే ఈ ప‌ని చేసింద‌ని తేల్చారు. ఆమెపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని చెప్పారు.