ఒక్కరోజులోనే 2,200 కోట్ల టన్నులు కరిగిన గ్రీన్​ ల్యాండ్​ ఐస్​.. 1990 నుంచి ఇది మూడోసారే: ఫొటోలివిగో

01-08-2021 Sun 12:20
  • ఈ వారమంతా భారీగా మంచు కరుగుదల
  • అంటార్కిటికాలో వేడి గాలుల వల్లే
  • ప్రస్తుతం అక్కడ రెట్టింపు ఉష్ణోగ్రతలు
GreenLand Ice Rapidly Melting

అభివృద్ధి కావొచ్చు.. మరేదైనా కారణం కావొచ్చు.. మనిషి చేసే చర్యలు ప్రకృత్తి విప్తతులకు కారణమవుతున్నాయి. పెరిగిపోతున్న భూతాపంతో ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రంలో కలిసిపోతోంది. గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. ఇది శాస్త్రవేత్తల హెచ్చరిక.


పోలార్ పోర్టల్ కు చెందిన శాస్త్రవేత్తలు.. ఈ వారంలో మంచు కరిగిన సంఘటనలను పరిశీలించారు. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు నిర్ధారించారు. 22 గిగాటన్నుల (2,200 కోట్ల టన్నులు) ఐస్ నీరుగా మారిందని నిర్ధారించారు. 1990 నుంచి ఒక్కరోజులో ఇంత మంచు కరిగిపోవడం ఇది మూడోసారి. కరిగిన దాంట్లో 1,200 కోట్ల టన్నుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్ కు చెందిన శాస్త్రవేత్త జేవియర్ ఫెట్విస్ తెలిపారు. మిగతా వెయ్యి టన్నుల నీళ్లు మళ్లీ మంచులాగా మారిపోయిందని తెలిపారు.  


వాతావరణంలో జరుగుతున్న మార్పులే అందుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ దీవుల్లో వేడి గాలులు ట్రాప్ అయ్యాయని, దాని వల్లే గ్రీన్ ల్యాండ్ మంచు కరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, సాధారణంగా అక్కడ వేసవిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు ఇది రెట్టింపని చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే అక్కడ 23.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందట.


ఆ వేడిగాలులు ఇంకొంత కాలం అలాగే ట్రాప్ అయితే మరింత మంచు కరిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రపంచంలోని మంచి నీళ్లలో దాదాపు 70 శాతం గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికాలోనే ఉన్నాయట. గ్రీన్ ల్యాండ్ మంచు మొత్తం కరిగితే సముద్ర మట్టాలు 20 నుంచి 23 అడుగులు పెరిగే ప్రమాదముందట.