జులై పోయింది కానీ, వ్యాక్సిన్ల కొరత పోలేదు: వీడియో పోస్ట్ చేసిన‌ రాహుల్ గాంధీ

01-08-2021 Sun 12:00
  • కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై మండిపాటు
  • వ్యాక్సినేష‌న్‌పై వీడియో పోస్ట్
  • వ్యాక్సిన్లు ఎక్క‌డా? అని ప్ర‌శ్న‌
rahul slams nda govt

దేశంలో వ్యాక్సిన్ల కొర‌తపై చాలా రోజులుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. జులైలోపు వ్యాక్సిన్ల కొర‌త తీరుతుంద‌ని, పెద్ద ఎత్తున డోసులు ఉత్ప‌త్తి అవుతున్నాయ‌ని కేంద్ర స‌ర్కారు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై రాహుల్ గాంధీ మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో పోస్ట్ చేసి, భార‌త్ అస‌లు వ్యాక్సినేష‌న్ ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లుగుతుందా? అని ప్ర‌శ్నించారు.

'జులై నెల వెళ్లిపోయింది.. కానీ, వ్యాక్సిన్ల కొర‌త మాత్రం పోలేదు. వ్యాక్సిన్లు ఎక్క‌డ‌?' అంటూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. కాగా, జులై 2న కూడా రాహుల్ గాంధీ ఇదే విష‌యంపై ఓ ట్వీట్ చేశారు. జులై వ‌చ్చేసింది, కావాల్సిన‌న్ని వ్యాక్సిన్లు మాత్రం ఇంకా రాలేదు అని కేంద్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు అదే రీతిలో జులై పోయినా, వ్యాక్సిన్ల కొర‌త పోలేద‌ని చెప్పారు.

కాగా, రాహుల్ గాంధీకి కొన్ని నెల‌ల క్రితం క‌రోనా సోక‌గా, అనంత‌రం చికిత్స తీసుకుని ఆయ‌న కోలుకున్నారు. జులై 28న ఆయ‌న తొలి డోసు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దేశంలో వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ట్టిమాట‌లు చెబుతోంద‌ని, దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం గ‌జిబిజిగా ఉంద‌ని అంటోంది. వ్యాక్సినేష‌న్ విధానాన్ని మార్చాల‌ని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను బీజేపీ తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని చెబుతోంది.