బాలుడి ప్రాణం తీసిన ఆన్​ లైన్​ గేమ్​.. ‘క్షమించు అమ్మా’ అంటూ ఆత్మహత్య

01-08-2021 Sun 11:51
  • డబ్బు డ్రా అయినట్టు తల్లికి సందేశం
  • కుమారుడికి మందలింపు
  • మనస్తాపంతో ఉరేసుకున్న చిన్నారి
  • రూ.40 వేలు పోగొట్టుకున్నట్టు సూసైడ్ లెటర్
13 year old boy loses rs 40000 in online game takes life

ఆన్ లైన్ మొబైల్ గేమింగ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ రూ.40 వేలు పోగొట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలోని శాంతినగర్ లో సంభవించింది. యుద్ధానికి సంబంధించిన ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్ ను ఆ చిన్నారి తరచూ ఆడేవాడు.

ఈ క్రమంలోనే నిన్న ఇంట్లో సోదరితో కలిసి ఉన్న ఆ బాలుడు.. ఫ్రీ ఫైర్ ఆడాడు. తన తల్లి ఖాతాలోంచి రూ.1,500ను వాడుకున్నాడు. డబ్బులు డ్రా అయినట్టు ఉద్యోగస్థురాలైన అతడి తల్లికి మెసేజ్ వెళ్లడంతో.. ఆమె వెంటనే కుమారుడికి ఫోన్ చేసింది. డ్రా చేసినట్టు బాలుడు చెప్పడంతో తల్లి మందలించింది.

దీంతో మనస్తాపానికి గురైన బాలుడు.. బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ‘సారీ అమ్మా..’ అని చెబుతూ తాను మొత్తం రూ.40 వేలు ఖాతా నుంచి తీసినట్టు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడే ఖాతా నుంచి డబ్బు డ్రా చేశాడా? లేదంటే ఎవరైనా బెదిరించారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.