సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్... వీడియో ఇదిగో!

31-07-2021 Sat 20:50
  • కదిలే రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం
  • పట్టు దొరక్క జారిపడిన వైనం
  • వేగంగా స్పందించిన కానిస్టేబుల్
  • మహిళను బయటికి లాగడంతో తప్పిన ముప్పు
RPF Constable saves woman life at Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఓ కానిస్టేబుల్ అందరి దృష్టిలో హీరో అయ్యాడు. కదిలే రైలు ఎక్కబోయే ప్రయత్నంలో ఓ మహిళ జారిపడగా, ఆ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సకాలంలో బయటికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ మహిళ పేరు నసీమాబేగం. ఆమె ప్లాట్ ఫాంపైకి చేరుకునే సమయానికి రైలు కదిలింది. దాంతో కంగారుపడిన ఆమె కదిలే రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ, పట్టు దొరక్క రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది.

అంతలో అటుగా దినేశ్ సింగ్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వచ్చాడు. మహిళ జారిపడడాన్ని గుర్తించి వేగంగా స్పందించాడు. ఆమెను బలంగా బయటికి లాగాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అటు, రైల్లో ఉన్న ప్రయాణికుడొకరు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఓ మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ దినేశ్ సింగ్ ను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పలువురిని ఆకట్టుకుంది. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్  కూడా ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.