రెండో షెడ్యూల్ కి రెడీగా హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్!

31-07-2021 Sat 18:30
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'మై నేమ్ ఈజ్ శృతి'
  • ప్రధానమైన పాత్రలో హన్సిక
  • ఫస్టు షెడ్యూల్ పూర్తి
  • వచ్చేనెలలో సెకండ్ షెడ్యూల్
Hansika new movie update

గ్లామరస్ హీరోయిన్ గా తమిళంలో హన్సిక ఒక వెలుగు వెలిగిపోయింది. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామకు అక్కడ ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. విపరీతమైన క్రేజ్ .. అందుకు తగిన డిమాండ్ .. భారీ పారితోషికంతో అక్కడ ఆమె కెరియర్ జోరుగా సాగింది. ఎప్పుడైనా అక్కడ కాస్త గ్యాప్ వస్తే ఇక్కడ తెలుగు సినిమా చేస్తూ వెళ్లింది.

ఒకప్పుడు తమిళనాట హన్సికకి అభిమానులు గుడి కట్టినప్పటికీ, కొత్త కథానాయికల పోటీ కారణంగా ఇప్పుడు అక్కడ ఆమె అంత బిజీగా లేదు. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో హిట్టు కూడా పడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తెలుగులో ఒక సినిమాను ఒప్పుకుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ .. ఈ సినిమా పేరే 'మై నేమ్ ఈజ్ శ్రుతి'.

రమ్య - నాగేంద్రరాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీ సెంట్ గా ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఆగస్టు రెండవ వారంలో రెండవ షెడ్యూల్ మొదలుకానుంది. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తించే ఈ సినిమాలో, మురళీశర్మ .. ఆడుకాలం నరేన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.