PV Ramana: సింధు దూకుడుగా ఆడేందుకు తై జు అవకాశం ఇవ్వలేదు: తండ్రి పీవీ రమణ

PV Ramana comments on his daughter Sindhu lose in Tokyo Olympics
  • టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు నిరాశ
  • బ్యాడ్మింటన్ సెమీస్ లో ఓటమి
  • వరుస గేముల్లో నెగ్గిన తై జు యింగ్
  • కుమార్తె ఓటమిపై స్పందించిన పీవీ రమణ
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో తన కుమార్తె పీవీ సింధు ఓటమిపాలవడం పట్ల పీవీ రమణ స్పందించారు. కీలకమైన సెమీస్ సమరంలో సింధు ఆట లయ తప్పిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ పతకం సాధించాలన్న పట్టుదల సింధు ప్రత్యర్థి తై జు యింగ్ లో కనిపించిందని వ్యాఖ్యానించారు. సింధు దూకుడుగా ఆడేందుకు తై జు యింగ్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. అయితే సింధును ఓడించిన తై జు యింగ్ ప్రపంచ నెంబర్ అని గుర్తుంచుకోవాలని రమణ పేర్కొన్నారు.  

సెమీఫైనల్ మ్యాచ్ లో తై జు యింగ్ ఎంతో వ్యూహాత్మకంగా ఆడిందని తెలిపారు. తొలి గేమ్ ను గెలిచిన ఊపుతో ఆమె రెండో గేమ్ ను మరింత ఉత్సాహంగా ఆడిందని వెల్లడించారు. ఈ మ్యాచ్ లో ఎక్కువ సేపు ర్యాలీలు ఆడకుండా తై జు జాగ్రత్త పడిందని వివరించారు. సింధు రేపు బాగా ఆడి కాంస్యం తీసుకువస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సింధు కోచ్ పై సంతృప్తికరంగానే ఉన్నామని పీవీ రమణ స్పష్టం చేశారు.

సిందు ఈ మధ్యాహ్నం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్ పోరులో వరుస గేముల్లో తై జు యింగ్ కు తలవంచింది. గత ఒలింపిక్స్ లో తనను ఓడించిన సింధుపై ఈ ఓటమి ద్వారా తై జు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక, రేపు  కాంస్యం కోసం జరిగే పోరులో సింధు... చైనాకు చెందిన హి బింగ్ జియావోతో తలపడనుంది.
PV Ramana
PV Sindhu
Lose
Tokyo Olympics
Badminton

More Telugu News