Ashok Babu: ఈరోజు అడ్డుకున్నారు.. రేపు ఎలా అడ్డుకుంటారో చూస్తాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • వనరులను దోచుకోవడంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారు
  • ఎన్జీటీ తీర్పు తర్వాత తవ్వకాలను మరింత ఎక్కువ చేశారు
  • రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం, ఎన్జీటీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తాం
Ashok Babu response on YSRCP leaders illegal mining

ప్రకృతి వనరులను దోచుకోవడంలో వైసీపీ నేతలు తలమునకలై ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు విమర్శించారు. ఇసుక, మట్టి, లాటరైట్, బాక్సైట్, సిలికాన్ వంటి అన్నింటిపై అధికార పార్టీ నేతల కన్ను పడిందని అన్నారు. పోలవరం కాలువను కూడా వదలడం లేదని చెప్పారు. అక్రమ మైనింగ్ కొనసాగుతోందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పే వైసీపీ నేతల దోపిడీకి నిదర్శనమని అన్నారు.

విశాఖ మన్యంలో బాక్సైట్ అక్రమ మైనింగ్ పై పూర్తి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని అశోక్ బాబు అన్నారు. ఎన్జీటీ తీర్పు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా తవ్వకాలను ఆపేస్తుందని... కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం అక్రమ మైనింగ్ ను ఎక్కువ చేసిందని మండిపడ్డారు.

కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతానికి టీడీపీ వారు వెళ్లకుండా ఈరోజు అడ్డుకున్నారని... కానీ, భవిష్యత్తులో ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. అక్రమ మైనింగ్ అంతు చూస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలపై కేంద్రానికి, గ్రీన్ ట్రైబ్యునల్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

More Telugu News