నేను చనిపోయాననే వార్తలు చూసి షాక్ అయ్యా: షకీల

31-07-2021 Sat 16:52
  • నా గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవం
  • నేను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నా
  • నాపై ప్రేమ చూపిన అందరికీ ధన్యవాదాలు
Iam shocked by seeing news that I dead says Shakeela

దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా షకీలకు ఎంతో గుర్తింపు ఉంది. శృంగార కథానాయికగా షకీలకు అప్పట్లో భారీ క్రేజ్ ఉండేది. ఆమె నటించిన సినిమాలు హిందీలో కూడా డబ్ అయి ఉత్తరాదిని కూడా ఊపేశాయి. ఆ తర్వాత ఆమె మంచి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం సినిమా అవకాశాలు తగ్గడంతో టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.

అయితే, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొన్ని వార్తలు, ఆమె చనిపోయిందని మరికొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, ఇవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.
 
తాను మరణించాననే వార్తలను చూసి షాక్ అయ్యానని షకీల అన్నారు. తాను బతికే ఉన్నానని చెప్పారు. తన గురించి ఎవరో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఈ తప్పుడు వార్తలు చూసి ఎంతో మంది తనకు ఫోన్లు చేశారని, మెసేజ్ లు పంపారని చెప్పారు. తనపై ప్రేమను చూపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారికి కూడా థ్యాంక్స్ చెపుతున్నానని... ఎందుకంటే అందరూ తన గురించి ఆలోచించేలా చేశారని చెప్పారు.