రామ్ సరసన మరో కథానాయిక ఎంపిక!

31-07-2021 Sat 16:47
  • లింగుసామి దర్శకత్వంలో రామ్ సినిమా
  • కథానాయికగా కృతిశెట్టి ఇప్పటికే ఎంపిక
  • మరో నాయికగా తాజాగా అక్షర గౌడ 
  • పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం   
Akshara Gouda opposite Ram in his latest film

సినిమా అనేది గ్లామర్ తో కూడిన వ్యవహారం. సినిమా నిండా ఏదో ఒక రకంగా గ్లామర్ అంశాలు వుండాలి. అప్పుడే ప్రేక్షకులను ఆ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి గ్లామర్ లో ప్రముఖ పాత్ర పోషించేది కథానాయిక. అందుకే, మన సినిమాలలో ఎక్కువగా ఇద్దరేసి కథానాయికలు.. ఒక్కోసారి ముగ్గురేసి కథానాయికలు కూడా ఉంటూ వుంటారు.

ఇక విషయానికొస్తే, ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీనివాస్ చిట్టూరి తాజాగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

కాగా, ఇందులో ప్రధాన కథానాయికగా 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టిని ఇంతకుముందే ఎంపిక చేశారు. ఆమె షూటింగులో కూడా పాల్గొంటోంది. తాజాగా మరో అందాలతార అక్షర గౌడ కూడా ఇందులో మరో నాయికగా నటిస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా అక్షర గౌడను తమ బృందంలోకి ఆహ్వానిస్తూ సినిమా టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.