Beef: గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహిస్తున్న మేఘాలయ బీజేపీ మంత్రి

  • చికెన్, మటన్, చేపల కంటే బీఫ్ బెస్ట్ అని వ్యాఖ్య
  • ఏ ఆహారం తీసుకోవాలనే స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్న సాన్ బర్ షులియా
  • హింసకు తాను వ్యతిరేకమన్న మంత్రి  
BJP minister encouraging to eat beef

బీఫ్ తినడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, బీఫ్ తినాలంటూ బీజేపీ మంత్రే ఒకరు ప్రోత్సహిస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. మేఘాలయ రాష్ట్ర మంత్రి సాన్ బర్ షులియా గత వారంలోనే పశు సంవర్ధక, వెటర్నరీ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ చికెన్, మటన్, చేపల కంటే బీఫ్ ఎక్కువగా తినాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ ఆహారం తీసుకోవాలనే స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఉంటుందని సాన్ బర్ షులియా చెప్పారు. అయితే, చికెన్, మటన్, చేపల కంటే బీఫ్ ఎక్కువగా తినాలని ప్రజలకు తాను సూచిస్తున్నానని... దీని వల్ల పశువధపై బీజేపీ నిషేధం విధించిందనే అపోహ కూడా తొలగిపోతుందని అన్నారు.

మేఘాలయ, అసోం మధ్య చిరకాలంగా ఉన్న సరిహద్దు అంశంపై ఆయన మాట్లాడుతూ... సరిహద్దులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అసోం ప్రజలు సరిహద్దుల్లో ఉన్న మన ప్రజలను వేధిస్తుంటే... చర్చలకే పరిమితం కాకుండా, అవసరమైతే తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

హింసకు తాను వ్యతిరేకమని... అయితే ఎవరైనా మన ఇంటికి వచ్చి మనపై దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం తిరగబడతామని... సరిహద్దుల విషయంలో కూడా అదే చేయాల్సి ఉందని చెప్పారు. చట్టబద్దమా? చట్ట విరుద్ధమా? అనేవి పక్కన పెట్టి... మనలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

More Telugu News